

తిరుమలకు వచ్చే భక్తుల భద్రత, సౌకర్యాలను కాపాడటంతో పాటు పవిత్రతను పరిరక్షించే లక్ష్యంతో పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ కె.వి. మురళీకృష్ణ, ఐపీఎస్ ఆదేశాల మేరకు, తిరుమల డీఎస్పీ పర్యవేక్షణలో ఈ తనిఖీలు చేపట్టారు. భక్తుల కోసం కేటాయించిన వసతి సముదాయాలు, హాళ్లలో అనధికారికంగా ఉంటున్న వ్యక్తులతో పాటు యాచకులను గుర్తించారు. ఈ క్రమంలో మొత్తం 62 మందిని గుర్తించారు.
వారందరికీ కౌన్సెలింగ్ నిర్వహించి తిరుమల నుంచి తిరుపతికి తరలించారు. అనుమతులు లేకుండా తిరుమలలో ఉండటం, యాచించడం, భక్తులకు ఇబ్బందులు కలిగించే కార్యకలాపాలకు పాల్పడటం వంటి వాటికి దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. స్థానిక వ్యాపారులు తమ వద్ద పనిచేసే కార్మికుల పూర్వాపరాలను తెలుసుకున్న తర్వాతే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, వారికి తగిన వసతి కల్పించాలని సూచించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా, అనధికారిక కార్యకలాపాలను అరికట్టేందుకు తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే పోలీసులకు, టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించాలని భక్తులను కోరారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!