

అల్లూరి జిల్లా అరకు ప్రాంతంలో గిరిజన సంఘాల పిలుపుతో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం నుంచే అరకు ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా కనిపించాయి. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ దుకాణాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూతపడ్డాయి. పర్యాటక ప్రాంతాలు కూడా మూసివేయడంతో బంద్ విషయం తెలియకుండా అరకు వచ్చిన పర్యాటకులు కొంత ఇబ్బందికి గురయ్యారు. తెల్లవారుజామున అరకు నుంచి మైదాన ప్రాంతాలకు బయలుదేరిన బస్సులు మాత్రం నడిచాయి.
జీవో నంబర్ 3ను పునరుద్ధరించాలని, 1/70 చట్టానికి సంబంధించిన అంశాలపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, గిరిజన ప్రాంతాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన జీవోలను రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. బంద్కు మద్దతుగా అనకాపల్లి జిల్లా రావికమతం మండలం బంగారు బందలు నుంచి కళ్యాణపులావ వరకు గిరిజన సంఘాలు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టాయి. నాన్-షెడ్యూల్డ్ గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్లో చేర్చడం, ఎస్సీ-ఎస్టీ మానిటరింగ్ కమిటీల్లో స్థానిక గిరిజన సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించడం, జెడ్.జోగంపేటలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయడం, గిరిజన సాగుదారులకు భూముల పట్టాలు ఇవ్వడం వంటి డిమాండ్లను వారు వినిపించారు. బాదంపాడు రెవెన్యూ పరిధిలోని గిరిజనులకు కేటాయించిన సీలింగ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అర్హులైన గిరిజనులకు అప్పగించాలని, జిల్లా జాయింట్ కలెక్టర్ స్వయంగా ఆ భూములను పరిశీలించాలని కోరారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!