

హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నగర పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, హైడ్రా, పోలీసు కమిషనర్లు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. హైదరాబాద్‌లో విపత్తు నిర్వహణ కోసం హైడ్రా పోలీసు, స్థానిక సంస్థలతో సమన్వయంతో అత్యవసర చర్యలు చేపడుతుంది.
ప్రధాన రహదారులు, జంక్షన్లు, కాలనీల్లో వర్షపు నీరు నిలిచిపోకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో సిబ్బంది, యంత్రాలను వెంటనే రంగంలోకి దించాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడటంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నాలాలు, డ్రైనేజీల్లో నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు సహాయక బృందాలు, కంట్రోల్ రూమ్‌లు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!