

తిరుమల డౌన్ ఘాట్ రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో జరిగిన ఆంజనేయస్వామి విగ్రహం అపహరణ కేసును కేవలం 24 గంటల్లో ఛేదించిన తిరుపతి జిల్లా పోలీసులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అభినందించారు. టీటీడీ విజిలెన్స్, తిరుపతి జిల్లా పోలీసులు, AI ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) సమన్వయంతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకోవడంతో పాటు విగ్రహాన్ని స్వాధీనం చేసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో జిల్లా ఎస్పీ, ప్రత్యేక బృందాలు, టీటీడీ విజిలెన్స్ అధికారులు సమర్థంగా పనిచేశారని ప్రశంసించారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ ఫుటేజ్, నిఘా సమాచారాన్ని సమర్థవంతంగా వినియోగించడం వల్లే కేసును అత్యంత వేగంగా ఛేదించడం సాధ్యమైందని మంత్రి తెలిపారు. తిరుమలతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాలు, ఉపాలయాలు, ఘాట్ రోడ్లు, పరిసర ప్రాంతాల్లో భద్రతా వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని అధికారులను ఆదేశించారు. దేవతా విగ్రహాలపై దుశ్చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!