

తెలంగాణలో పబ్లిక్ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ఛార్జింగ్ మౌలిక వసతులు భారీగా విస్తరించనున్నాయి. ఈ మేరకు తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో) రాష్ట్రవ్యాప్తంగా 369 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ, అప్‌గ్రేడేషన్, వాణిజ్య నిర్వహణ కోసం ప్రైవేట్ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్ల (CPOs) నుంచి టెండర్లను ఆహ్వానించింది. ఇందులో హైదరాబాద్‌లోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో ఆరు క్లస్టర్లుగా 200 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. TGNPDCL పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని 16 ప్రాంతాల్లో మరో 169 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. రెండు ప్రాజెక్టుల కాంట్రాక్ట్ కాలం 10 సంవత్సరాలు.
పెరుగుతున్న ఈవీ వినియోగానికి అనుగుణంగా ఛార్జింగ్ సదుపాయాలను విస్తరించడంతో పాటు ప్రైవేట్ రంగానికి దీర్ఘకాలిక వ్యాపార అవకాశాలను కల్పించడమే ఈ ప్రాజెక్టుల లక్ష్యమని టీజీ రెడ్కో తెలిపింది. వినియోగదారులకు ఛార్జింగ్ టారిఫ్‌ను యూనిట్‌కు రూ.13గా (GST అదనం) నిర్ణయించారు. హైదరాబాద్ ప్రాజెక్టులో ఛార్జర్లకు కనీసం 95 శాతం అప్‌టైమ్ ఉండేలా నిబంధనలు రూపొందించారు. 169 స్టేషన్ల ప్రాజెక్టులో సర్వే, డిజైన్, సరఫరా, సివిల్ వర్క్స్, ఇన్‌స్టాలేషన్, టెస్టింగ్, కమిషనింగ్‌తో పాటు 10 ఏళ్ల పాటు నిర్వహణ చేపట్టాలి. రెండు ప్రాజెక్టులకు ప్రీ-బిడ్ సమావేశాలు ఈ నెల 7న జరగనుండగా, బిడ్ల సమర్పణ ఈ నెల 8 నుంచి 22 వరకు కొనసాగుతుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!