

రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్లు, ప్రైవేట్ కార్యక్రమాల నిర్వహణను నిషేధించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇటీవల కొన్ని విద్యాసంస్థల్లో నిర్వహించిన కార్యక్రమాలు విద్యార్థుల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. ఓ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమం నిర్వహించగా, మరో ఇంజినీరింగ్ కళాశాలలో తగిన ముందస్తు జాగ్రత్తలు లేకుండా నిర్వహించిన దాండియా వేడుకలో తొక్కిసలాట చోటుచేసుకుని ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు విద్యాసంస్థల్లో నిర్వహించే కార్యక్రమాలపై నియంత్రణలు విధించాలని ప్రభుత్వం భావిస్తోంది.
విద్యాసంస్థల్లో చట్టబద్ధంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవచ్చు, ఏవి నిర్వహించకూడదనే అంశాలపై సమగ్ర అధ్యయనం చేయాలని విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. విద్యా ప్రాంగణాలను ప్రధానంగా విద్యా, క్రీడా కార్యక్రమాలకే పరిమితం చేయాలని, సినిమా ప్రమోషన్లు, ఇతర వాణిజ్య కార్యక్రమాలకు వేదికగా ఉపయోగించరాదని భావిస్తోంది. చిన్నస్థాయి కార్యక్రమాలకు అనుమతించే అవకాశం ఉన్నప్పటికీ, వందలాది మంది పాల్గొనే, బయటి వ్యక్తులు హాజరయ్యే ఈవెంట్ల విషయంలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించేలా నిబంధనలు రూపొందించనుంది. విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకు సంబంధించి చట్టం తీసుకురావాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి రూపొందించిన ముసాయిదా నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!