

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే నిరుద్యోగుల గరిష్ఠ వయో పరిమితిని రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పోలీస్ ఉద్యోగాలకూ వర్తించనుంది. పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అగ్నిమాపక దళం, జైళ్ల శాఖల్లో 7,437 పోస్టుల భర్తీకి జులై 29న జారీ చేసిన నాలుగు నోటిఫికేషన్లకు ఈ వయో పరిమితి సడలింపు వర్తిస్తుందని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TGPRB) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. సివిల్ కానిస్టేబుళ్లు, సివిల్ ఎస్‌ఐలు, మెకానిక్‌లు, డ్రైవర్ కానిస్టేబుళ్లు, ఫింగర్‌ప్రింట్ బ్యూరో పోస్టులు కూడా ఈ సడలింపు పరిధిలోకి వస్తాయని వెల్లడించారు.
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 19 ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబరు 9 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు TGPRB అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి నోటిఫికేషన్‌లోని అర్హతలు, వయో పరిమితి, ఇతర నిబంధనలను పూర్తిగా పరిశీలించిన తర్వాత దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. వయో పరిమితి సడలింపుతో గతంలో వయస్సు కారణంగా అవకాశం కోల్పోయిన నిరుద్యోగులకు ఈ నియామక ప్రక్రియలో మరో అవకాశం లభించనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!