

దేశీయ ఫార్మా దిగ్గజాలు కొత్త ఔషధాల విడుదల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఉన్న మందుల విక్రయాలపైనే ఆధారపడకుండా, అధిక డిమాండ్ ఉన్న మధుమేహం, ఊబకాయం, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్, చర్మ వ్యాధుల చికిత్సలకు సంబంధించిన కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, సన్ ఫార్మా, సిప్లా, గ్లెన్‌మార్క్ వంటి సంస్థలు ఈ విభాగాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. డాక్టర్ రెడ్డీస్ సెమాగ్లుటైడ్ ఔషధాలను అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. తయారీ సామర్థ్యానికి సంబంధించిన సమస్య పరిష్కారమైందని, తుది నాణ్యతా పరీక్షలు పూర్తయితే నవంబరులో సరఫరాను తిరిగి ప్రారంభిస్తామని సంస్థ వెల్లడించింది. సిప్లా ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో అమెరికా మార్కెట్ కోసం ఒక పెప్టైడ్ ఉత్పత్తిని విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
శ్వాసకోశ ఔషధాలు, క్యాన్సర్ చికిత్సలు, చర్మ వ్యాధులకు సంబంధించిన ఉత్పత్తులపైనా కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. వెంటోలిన్, అడ్వైర్ జనరిక్ వెర్షన్లకు అమెరికాలో అనుమతులు పొందిన సిప్లా.. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో మరో రెండు శ్వాసకోశ ఉత్పత్తులను విడుదల చేయాలని భావిస్తోంది. గ్లెన్‌మార్క్ 2026-27 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఫ్లోవెంట్ 110 జనరిక్, ఐప్రాట్రోపియం ఇన్‌హేలర్లను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. నాట్కో ఫార్మా బ్రెజిల్, కెనడా మార్కెట్ల కోసం క్యాన్సర్ ఔషధాలపై, అమెరికా కోసం సెమాగ్లుటైడ్ పెన్ ఉత్పత్తులపై పనిచేస్తోంది. సన్ ఫార్మా కొత్త చికిత్సలకు అనుమతులు పొందడం ద్వారా చర్మ వ్యాధుల విభాగాన్ని విస్తరించుకోవాలని చూస్తోంది. మరోవైపు గ్లాండ్ ఫార్మా పాశమైలారం కేంద్రంలో మూడు ఇంజెక్షన్ తయారీ లైన్ల ఏర్పాటుకు రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. గ్రాన్యూల్స్ ఇండియా వచ్చే రెండు త్రైమాసికాల్లో అమెరికాలో ఐదు ఉత్పత్తులను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ ప్రణాళికల విజయానికి నియంత్రణ సంస్థల అనుమతులు, ఉత్పత్తి సామర్థ్యం, మార్కెట్‌లో పోటీ కీలకం కానున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!