

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 1న 1,000 రోజుల పాలనను పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఆదివారం ‘ప్రగతి నివేదిక’ను విడుదల చేసింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను పునర్నిర్మించడం, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇవ్వడం, రైతులు, మహిళలు, యువతకు భరోసా కల్పించడం, భారీ పెట్టుబడులను ఆకర్షించడం, భవిష్యత్ తెలంగాణకు ప్రపంచస్థాయి మౌలిక వసతులు కల్పించడంపై దృష్టి సారించినట్లు ప్రభుత్వం తెలిపింది. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొంది. హైదరాబాద్ నుంచి గ్రామీణ తెలంగాణ వరకు సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు వివరించింది. ఆర్థిక ప్రగతి, వ్యవసాయం, రైతు సంక్షేమం, మహిళా సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి, వైద్యం, మౌలిక వసతుల రంగాల్లో సాధించిన పురోగతిని నివేదికలో ప్రస్తావించింది.
2025-26లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరినట్లు ప్రభుత్వం తెలిపింది. రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ ద్వారా 25 లక్షలకుపైగా రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చినట్లు, రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లకుపైగా పెట్టుబడి సాయం అందించినట్లు పేర్కొంది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఉచిత ఆర్టీసీ ప్రయాణాలతో దాదాపు రూ.11 వేల కోట్లు ఆదా చేసినట్లు తెలిపింది. గృహజ్యోతి కింద 53 లక్షలకుపైగా కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నట్లు వెల్లడించింది. 72 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడంతో పాటు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపింది. వైద్యరంగంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడంతో పాటు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా వేలాది మంది పేదలకు ఆర్థిక సాయం అందించినట్లు వివరించింది. రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో రెండో దశ, మామునూరు విమానాశ్రయం, మూసీ పునరుజ్జీవం, కొత్త ఎస్టీపీల వంటి మౌలిక వసతుల ప్రణాళికలను కూడా నివేదికలో ప్రస్తావించింది. టీజీ-ఐపాస్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించినట్లు తెలిపింది. 2025-26లో రాష్ట్ర ఐటీ ఎగుమతులు రూ.3.97 లక్షల కోట్లకు చేరాయని, 12.14 లక్షల ప్రత్యక్ష ఐటీ ఉద్యోగాలు ఉన్నాయని పేర్కొంది. హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, క్లౌడ్, కృత్రిమ మేధ రంగాల విస్తరణతో తెలంగాణ దేశంలో ప్రముఖ సాంకేతిక గమ్యస్థానంగా ఎదుగుతోందని ప్రభుత్వం వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!