

తెలంగాణలో విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వినియోగం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈగల్) అధ్యయనం ప్రకారం.. రాష్ట్రంలో గత మూడేళ్లలో సుమారు 800 మంది విద్యార్థులు మత్తుమందుల వినియోగానికి అలవాటు పడినట్లు గుర్తించారు. వీరిలో 100 మందికిపైగా అమ్మాయిలు ఉండటం గమనార్హం. ఈగల్ బృందాలు బాధిత విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు వ్యసన విముక్తి కేంద్రాలకు పంపిస్తున్నాయి. ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రముఖ విశ్వవిద్యాలయాలతో పాటు వసతిగృహాలు కూడా డ్రగ్స్ వినియోగానికి వేదికలుగా మారుతున్నట్లు దర్యాప్తులో వెల్లడవుతోంది. ఇటీవల ఓ యూనివర్సిటీలో నిర్వహించిన తనిఖీల్లో 17 మంది విద్యార్థులకు డ్రగ్ పరీక్షలు పాజిటివ్‌గా వచ్చినట్లు సమాచారం. మరో యూనివర్సిటీలో నలుగురిని డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేయగా.. మరో 50 మంది విద్యార్థులు మత్తుమందులు వినియోగిస్తున్నట్లు తేలింది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యాసంస్థల్లోనూ ఈ సమస్య ఉన్నట్లు దర్యాప్తు బృందాలు చెబుతున్నాయి. సుమారు 500 మంది విద్యార్థులను ప్రశ్నించినప్పుడు డ్రగ్స్‌ను తొలిసారి ఎవరి ద్వారా పరిచయం అయ్యాయని అడిగితే.. ఎక్కువగా ‘ఫ్రెండ్’ అనే సమాధానం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. పుట్టినరోజు వేడుకలు, పబ్‌లు, పార్టీలు, ఫాంహౌస్‌లలో స్నేహితుల ప్రోత్సాహంతో డ్రగ్స్ రుచి చూడటం కొందరు విద్యార్థులకు వ్యసనంగా మారుతోంది.
మరోవైపు ఈగల్ బృందాలు అవగాహన కార్యక్రమాలతో పాటు అనుమానిత హాట్‌స్పాట్‌లు, విద్యాసంస్థల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ‘డ్రగ్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల’ ద్వారా ప్రాథమిక మూత్ర పరీక్షలను నిర్వహించి సుమారు 15 నిమిషాల్లో ఫలితాలను తెలుసుకుంటున్నారు. ఈ మల్టీ-స్ట్రిప్ కిట్లు అంఫెటమైన్‌లు, ఓపియాడ్‌లు, గంజాయి, బెంజోడియాజెపైన్ తదితర పలు రకాల మాదకద్రవ్యాల ఉనికిని ప్రాథమికంగా గుర్తించేందుకు ఉపయోగపడుతున్నాయి. పాజిటివ్‌గా వచ్చిన వారికి ఆసుపత్రుల్లో తదుపరి పరీక్షలు నిర్వహించి, అవసరమైన ఆధారాలను సేకరిస్తున్నారు. అనంతరం విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చి వ్యసన విముక్తి కేంద్రాల్లో చికిత్స పొందేలా చర్యలు తీసుకుంటున్నారు. నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం 598 మంది వినియోగదారులు, 68 మంది సరఫరాదారులు, 43 మంది వినియోగదారులు-సరఫరాదారులు, 32 మంది రవాణాదారులు-సరఫరాదారులు, ఆరుగురు పెడ్లర్లు, నలుగురు పెడ్లర్లు-సరఫరాదారులు, ఇద్దరు రవాణాదారులు-పెడ్లర్లు-సరఫరాదారులుగా, మరో 47 మందిని ఇతర విభాగాల్లో గుర్తించారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లోనూ అవగాహన పెంచి యువత డ్రగ్స్ బారిన పడకుండా నిరోధించడంపై ఈగల్ బృందాలు దృష్టి సారిస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!