

‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్‌కు అనుగుణంగా రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆర్థిక, పారిశ్రామిక శక్తిగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాలకు శ్రీకారం చుడుతోంది. ప్రస్తుత పారిశ్రామిక విధానానికి దాదాపు పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ‘ఇండస్ట్రియల్ పాలసీ 2.0’కు రూపకల్పన చేస్తోంది. వచ్చే ఐదేళ్లలో భారీ పెట్టుబడులను ఆకర్షించడం, తయారీ రంగాన్ని విస్తరించడం, ఆధునిక సాంకేతికతలను రాష్ట్రానికి తీసుకురావడం, లక్షలాది ఉద్యోగాలను సృష్టించడం, హైదరాబాద్‌తో పాటు జిల్లాలు, టైర్-2, టైర్-3 నగరాలను పారిశ్రామిక వృద్ధి కేంద్రాలుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. 10 కీలక రంగాలకు ప్రత్యేక విధానాలను రూపొందిస్తోంది. ఇప్పటికే దావోస్ వేదికగా ‘నెక్స్ట్‌జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30’ను ప్రకటించగా.. డిసెంబరు 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమిట్’లో మరో తొమ్మిది కొత్త విధానాలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
కొత్త పారిశ్రామిక విధానాల్లో కేవలం పెట్టుబడి విలువనే కాకుండా ఉపాధి కల్పన, తయారీ సామర్థ్యం, స్థానిక విలువ జోడింపు, ఎగుమతులు, పారిశ్రామిక ఎకోసిస్టమ్, ప్రభుత్వ ఆదాయం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. భారీ, మెగా పరిశ్రమలకు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు కల్పించడంతో పాటు హైదరాబాద్ వెలుపల పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు అదనపు రాయితీలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. లైఫ్ సైన్సెస్, ఐటీ, ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫుట్‌వేర్, అప్పెరల్, జీసీసీలు, డేటా సెంటర్లు, లాజిస్టిక్స్, ఆటోమొబైల్ రంగాలకు ప్రత్యేక విధానాలు రూపొందిస్తున్నారు. 2030 నాటికి ప్రపంచంలోని టాప్-3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో తెలంగాణను ఒకటిగా నిలపడం, ఐదేళ్లలో 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 5 లక్షల కొత్త ఉద్యోగాలు సాధించడం ‘నెక్స్ట్‌జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ’ ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ‘ఐటీ పాలసీ 2.0’లో ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డీప్‌టెక్, ఫిన్‌టెక్, డిజిటల్ ఇంజినీరింగ్ వంటి భవిష్యత్ సాంకేతిక రంగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎలక్ట్రానిక్స్ పాలసీ ద్వారా సెమీకండక్టర్లు, చిప్ డిజైన్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తయారీని ప్రోత్సహించి తెలంగాణను ‘చైనా ప్లస్ వన్’ కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్పేస్‌టెక్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఉపాధి ఆధారిత తయారీ, జీసీసీలు, డేటా సెంటర్లు, లాజిస్టిక్స్, ఆటోమొబైల్ రంగాల అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. కార్లు, ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, ఆటో కాంపోనెంట్స్ తయారీ సంస్థలను ఆకర్షించడం ద్వారా తెలంగాణలో విస్తృత పారిశ్రామిక ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!