

తెలంగాణలో 33 జిల్లాలకు గాను హైదరాబాద్, పెద్దపల్లి మినహా మిగిలిన 31 జిల్లాల్లోని 365 మండలాలను ప్రభుత్వం కరవు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది. వీటిలో 111 మండలాల్లో తీవ్ర కరవు, 254 మండలాల్లో మధ్యస్థ కరవు పరిస్థితులు ఉన్నట్లు వెల్లడించింది. కరవు ప్రాంతాల్లో వెంటనే ఉపశమన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో జూన్ నుంచి సెప్టెంబరు వరకు సాధారణ వర్షపాతం 740.6 మి.మీ.కు బదులుగా 615.5 మి.మీ. మాత్రమే నమోదైందని, మొత్తంగా 17 శాతం లోటు ఏర్పడిందని ప్రభుత్వం తెలిపింది. దీంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 139.28 లక్షల ఎకరాల నుంచి 126.06 లక్షల ఎకరాలకు తగ్గగా, వరి సాగు దాదాపు 18 శాతం పడిపోయింది. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గడంతో తాగునీరు, వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తి, పశువుల మేత సరఫరాపైనా ప్రభావం పడింది.
కరవు బాధిత రైతులను గుర్తించి పెట్టుబడి రాయితీలు అందించడం, తాగునీటి కొరత నివారణ, పశుగ్రాసం పంపిణీ, పశు శిబిరాల ఏర్పాటు, ఉపాధి పనులు కల్పించడం వంటి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. బ్యాంకుల సహకారంతో పంట రుణాల రీషెడ్యూల్, బలవంతపు రుణ వసూళ్ల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. తీవ్ర కరవు ఉన్న మండలాల వివరాలను ఏడు రోజుల్లో కేంద్రానికి పంపాలని ఆదేశించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని తెలంగాణ కోరింది. సూర్యాపేట, నారాయణపేట, జోగులాంబ గద్వాల, హనుమకొండ, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని అన్ని మండలాలను కరవు జాబితాలో చేర్చింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!