

దేశంలో శీతాకాలపు పొగమంచు సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో విమాన సర్వీసులకు అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ విమానయాన సంస్థలను ఆదేశించింది. తక్కువ దృశ్యమానత ఉన్న పరిస్థితుల్లో విమానాలను నడపడానికి అర్హత పొందిన సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. విమానాలు సంబంధిత భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని, వాతావరణ పరిస్థితులు, వాస్తవ కార్యాచరణ పరిమితులను పరిగణనలోకి తీసుకుని విమాన షెడ్యూళ్లను రూపొందించాలని స్పష్టం చేసింది.
భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనాల ప్రకారం డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు పొగమంచు సీజన్ కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం పౌర విమానయాన శాఖ వివిధ విభాగాల అధికారులు, విమానయాన రంగ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించింది. పొగమంచు కారణంగా విమానాలు ఆలస్యం కావడం, రద్దు కావడం లేదా షెడ్యూళ్లలో మార్పులు చోటుచేసుకోవడం వంటి సందర్భాల్లో ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. విమాన సర్వీసుల నిర్వహణను మెరుగుపరచడంతో పాటు ప్రయాణికులకు సకాలంలో సమాచారం, అవసరమైన సహాయం అందించడంపై దృష్టి సారించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!