

అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన సహాయక చర్యలు చేపట్టి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (RTGS) అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. మంగళవారం రాత్రి 1.30 గంటల వరకు అధికారులతో సమీక్షించిన సీఎం, బుధవారం ఉదయం 6 గంటల తర్వాత మరోసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావం, తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అర్నబ్ తుపాను ప్రభావంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని RTGS అధికారులు సీఎంకు వివరించారు. బలమైన గాలుల కారణంగా పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని తెలిపారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు వెల్లడించారు. రోడ్లపై పడిపోయిన చెట్లను వెంటనే తొలగించాలని, తుపాను తీవ్రత పూర్తిగా తగ్గిన తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. పలు జిల్లాల కలెక్టర్లు తమ ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక, పునరుద్ధరణ చర్యలను వివరించారు. కోనసీమ జిల్లాలో సుమారు 6 వేల విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్లు జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!