

అర్నాబ్ తుఫాను ప్రభావంతో కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో పరిస్థితులు తీవ్రంగా మారినట్లు సమాచారం. భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల ధాటికి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎస్పీ కార్యాలయం పరిసరాలు, ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్, కలెక్టర్ బంగ్లా సమీప ప్రాంతాలు, లక్ష్మీ టాకీస్ సెంటర్‌తో పాటు పలు ప్రధాన రహదారులపై చెట్లు కూలిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల చెట్లు రహదారులకు అడ్డంగా పడటంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తుఫాను ప్రభావంతో జంతువులు కూడా మృత్యువాత పడినట్లు సమాచారం.
భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు రహదారులపై నీరు నిలిచిపోయి రాకపోకలు మందగించాయి. ఒక్కసారిగా మారిన వాతావరణ పరిస్థితులతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కూలిపోయిన చెట్లను తొలగించి, రహదారులను క్లియర్ చేసి సాధారణ రాకపోకలను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకరంగా ఉన్న చెట్లు, తెగిపడిన విద్యుత్ తీగలు, నీరు నిలిచిన ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. తుఫాను ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అధికారుల సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!