

సాయి పల్లవి ఇటీవల తన కుటుంబం, బాల్యం, వ్యక్తిగత జీవితంలో ఎదురైన అనుభవాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన తండ్రి ఎప్పుడూ చదువుపై దృష్టి పెట్టాలని ప్రోత్సహించేవారని, తల్లి మాత్రం చదువుతో పాటు ఇతర కళలు, నైపుణ్యాలు కూడా నేర్చుకోవాలని సూచించేవారని తెలిపారు. అందుకే ప్రాపంచిక విషయాలను తండ్రితో, భావోద్వేగాలకు సంబంధించిన విషయాలను తల్లితో ఎక్కువగా పంచుకునేదాన్నని చెప్పారు. చిన్నతనంలో తల్లిదండ్రులు తనను మందలించేవారని, అయితే ఇప్పుడు వారిద్దరికీ తనంటే కొంత భయమని సరదాగా వెల్లడించారు. తన తండ్రి ఫుట్‌బాల్ క్రీడాకారుడని, భారత జట్టు తరఫున కూడా ఆడారని కొన్ని సంవత్సరాల క్రితమే తెలిసి ఆశ్చర్యపోయానన్నారు. ఆయన తన విజయాల గురించి ఎప్పుడూ గొప్పగా చెప్పుకోకుండా సాధారణ జీవితాన్నే ఇష్టపడేవారని తెలిపారు. ఆటలో రెండు కాళ్లకు గాయాలు కావడంతో స్టీల్ ప్లేట్లు అమర్చారని, దాంతో క్రీడలకు వీడ్కోలు పలకాల్సి వచ్చిందని వివరించారు.
డాక్టర్‌గా ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో ఎదురైన ఓ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని సాయి పల్లవి చెప్పారు. ఓ రోగితో ఐదు నిమిషాలు మాట్లాడిన తర్వాత, ఆమె మరణించినట్లు తెలిసిందని గుర్తుచేసుకున్నారు. ఈ అనుభవం తనపై తీవ్ర ప్రభావం చూపిందని, జీవిత విలువను తెలియజేసిందని అన్నారు. రోడ్డు ప్రమాదాలను చూడటం లేదా వాటి గురించి వినడం కూడా తాను తట్టుకోలేనని, అతివేగం ప్రాణాలను బలిగొంటుందని చెప్పారు. జీవితంలో జరగాల్సినవి జరుగుతాయని నమ్ముతానని, అయితే లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం కష్టపడాలని అభిప్రాయపడ్డారు. ఈ నమ్మకాన్ని తన తల్లి నుంచి నేర్చుకున్నట్లు తెలిపారు. ఇక రామాయణం సినిమాలో సీత పాత్ర పోషించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దర్శకుడు నితీష్ తివారీ జూమ్ కాల్ ద్వారా పాత్ర గురించి వివరించారని, ఆ తర్వాత ముంబయిలో ఆడిషన్ నిర్వహించారని చెప్పారు. యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేక వర్క్‌షాపుల్లోనూ పాల్గొన్నట్లు వెల్లడించారు. దాదాపు మూడేళ్ల కష్టం, నిరీక్షణ తర్వాత సీతగా వెండితెరపై కనిపించేందుకు సిద్ధమవుతున్నానని తెలిపారు.
తన చెల్లెలు పూజ పెళ్లి సమయంలో ఎంతో భావోద్వేగానికి గురయ్యానని సాయి పల్లవి గుర్తుచేసుకున్నారు. చెల్లిని ఎప్పుడూ తన కూతురిలా చూసుకున్నానని, పెళ్లి తర్వాత ఆమె మరో ఇంటికి వెళ్లిపోతుందనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయానని చెప్పారు. ఆ వేడుకలో అమ్మానాన్నల కంటే తానే ఎక్కువగా ఏడ్చానని వెల్లడించారు. పెళ్లి జరిగి దాదాపు ఏడాది కావస్తున్నా, ఇప్పటివరకు చెల్లెలి పెళ్లి ఫొటోలను చూడలేదన్నారు. వాటిని చూస్తే మళ్లీ భావోద్వేగానికి గురవుతానేమోనని భయపడుతున్నట్లు తెలిపారు. సాయి పల్లవి వెల్లడించిన ఈ విషయాలు ఆమెకు కుటుంబంపై ఉన్న అనుబంధాన్ని, జీవితంలో ఎదురైన అనుభవాలను, సీత పాత్ర కోసం చేస్తున్న కృషిని తెలియజేస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!