

భారత రక్షణ ఉత్పత్తుల తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్‌ఎల్) కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ట్యాంకు నిరోధక ‘జావెలిన్ ఆల్ అప్ రౌండ్’ క్షిపణి వ్యవస్థల ఉత్పత్తి కోసం అమెరికాకు చెందిన రేథియాన్, లాక్‌హీడ్ మార్టిన్‌ల జావెలిన్ జాయింట్ వెంచర్‌తో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా భారత్‌లో జావెలిన్ ఏయూఆర్ క్షిపణుల తుది అసెంబ్లీ, ఇంటిగ్రేషన్ ప్లాంటుతో పాటు విడిభాగాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఒప్పందం ప్రకారం అమెరికాలో తయారయ్యే కీలక సబ్-అసెంబ్లీ కిట్లు, గైడెన్స్ ఎలక్ట్రానిక్ యూనిట్లను భారత్‌కు తీసుకువచ్చి ఇక్కడ తుది అసెంబ్లీ నిర్వహించనున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా భారత రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి, కొత్త ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు సైనిక దళాలకు ఆధునిక యుద్ధ పరికరాలు వేగంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. భారీ స్థాయిలో ఉమ్మడి ఉత్పత్తి చేపట్టడం ద్వారా ఒక్కో క్షిపణి తయారీ వ్యయం కూడా తగ్గనుంది. ఫారిన్ మిలిటరీ సేల్స్ కింద 100 ఎఫ్‌జీఎం-148 జావెలిన్ క్షిపణులు, ఒక ఫ్లై-టు-బై క్షిపణి, 25 తేలికపాటి కమాండ్ లాంచ్ యూనిట్ల కొనుగోలుకు రూ.434.84 కోట్ల అంచనా వ్యయంతో భారత్ ప్రణాళికలు రూపొందించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!