

అయోధ్య రామాలయంలో విరాళాల చోరీకి సంబంధించిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమర్పించిన స్థాయీ నివేదికను సుప్రీంకోర్టు సోమవారం పరిశీలించింది. సిట్ దర్యాప్తులో భాగంగా సీసీటీవీ దృశ్యాలను విశ్లేషించగా.. విరాళాల చోరీకి సంబంధించిన 105 ఘటనలు నమోదైనట్లు కోర్టుకు వెల్లడించారు. సాక్షుల వాంగ్మూలాలు, విరాళాల రికార్డులు, ఇతర ఆధారాలను కూడా దర్యాప్తు బృందం పరిశీలించినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. దర్యాప్తు తుది దశకు చేరుకుందని, సెప్టెంబర్ 25లోగా ఛార్జిషీట్ దాఖలు చేస్తామని ఆయన ధర్మాసనానికి వెల్లడించారు.
ఈ వివరాలను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం నమోదు చేసుకుంది. ఛార్జిషీట్ దాఖలైన అనంతరం చట్ట నిబంధనల ప్రకారం సంబంధిత కోర్టు తదుపరి చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇదిలా ఉండగా.. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తొలి ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో)గా నియమితులైన రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్ర సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అయోధ్య రామాలయ ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన కార్యాలయంలోకి వెళ్లే ముందు ఆయన ఆలయంలో పూజలు నిర్వహించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!