

ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ ప్రక్రియలో భాగంగా ‘సహేతుక వ్యత్యాసాలు’ పేరుతో ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్న విధానంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నోటీసులు యాంత్రికంగా జారీ అవుతున్నాయన్న అభిప్రాయంతో, వాటిని పంపే ముందు అదనపు పరిశీలనలు, జాగ్రత్తలు అవసరమా అన్నది పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అలాగే ‘సహేతుక వ్యత్యాసం’గా ఓటర్లను గుర్తించేందుకు అనుసరిస్తున్న ప్రాతిపదిక, ప్రమాణాలు స్పష్టంగా ఉండాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనా ధర్మాసనం పేర్కొంది.
అంజలీ భరద్వాజ్, అమృతా జోహ్రీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు వచ్చాయి. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ, ఢిల్లీలో 33 లక్షలకు పైగా ఓటర్లకు నోటీసులు జారీ చేశారని, వాటి వెనుక ఉన్న ప్రమాణాలు, కారణాలు స్పష్టంగా వెల్లడించడం లేదని వాదించారు. అయితే ఎన్నికల సంఘం తరఫున డీఎస్ నాయుడు పిటిషనర్లు తమ వాదనకు మద్దతుగా నిర్దిష్ట ఉదాహరణలు చూపలేదని, నోటీసుల కారణాలను ఓటర్లకు తెలియజేస్తున్నామని కోర్టుకు తెలిపారు. నోటీసుల పరిష్కారానికి సుమారు 15 వేల మంది బీఎల్‌ఓలు, 1,200 మంది ఈఆర్‌ఓలను నియమించినట్లు ఎన్నికల సంఘం వివరించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!