

కృష్ణా జిల్లాలో జరిగిన పరిషత్తు ఎన్నికల్లో రెబల్, స్వతంత్ర అభ్యర్థులు సత్తాచాటారు. ఒక జడ్పీటీసీ స్థానంతో పాటు ఎనిమిది ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్నారు. కూటమి, వైఎస్సార్‌సీపీ, ఇతర పార్టీల అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైనా మంచి మెజార్టీలతో విజయం సాధించారు. మొవ్వ జడ్పీటీసీ స్థానంతో పాటు గన్నవరం మండలంలో రెండు, చల్లపల్లి, మచిలీపట్నం ఉత్తర, దక్షిణ, మొవ్వ, పామర్రు, పమిడిముక్కల మండలాల్లో ఒక్కొక్క ఎంపీటీసీ స్థానాన్ని రెబల్, స్వతంత్ర అభ్యర్థులు గెలుచుకున్నారు. మొవ్వ జడ్పీటీసీ స్థానాన్ని తెదేపా నుంచి ఆశించిన నన్నపనేని వీరేంద్రకు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో అవకాశం దక్కలేదు. దీంతో ఆయన తెదేపా రెబల్ అభ్యర్థిగా పోటీ చేయగా, పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. అయినప్పటికీ పోటీ నుంచి తప్పుకోకుండా స్థానిక ప్రజాదరణతో 6,668 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. వైఎస్సార్‌సీపీ ఓటర్లు కూడా ఆయనకు మద్దతు పలకడం విజయానికి కలిసొచ్చినట్లు సమాచారం.
ఇతర ప్రాంతాల్లోనూ రెబల్, స్వతంత్ర అభ్యర్థులు విజయాలు నమోదు చేశారు. మచిలీపట్నం దక్షిణ మండలం భోగిరెడ్డిపల్లి ఎంపీటీసీ స్థానాన్ని తెదేపా రెబల్ అభ్యర్థి నండూరి ఏడుకొండలు 252 ఓట్ల మెజార్టీతో గెలుచుకున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మారెళ్ల సుబ్బారావుపై ఆయన విజయం సాధించగా, జనసేన అభ్యర్థి మూడో స్థానానికి పరిమితమయ్యారు. మచిలీపట్నం ఉత్తర మండలం మేకావానిపాలెంలో తెదేపా రెబల్ అభ్యర్థి వాలిశెట్టి విమనీష్ జనసేన అభ్యర్థి శ్రీపతి భానుమూర్తిపై 1,493 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. పామర్రు మండలం రాపర్లలో జనసేన రెబల్ అభ్యర్థి మట్టా హిమబిందు 337 ఓట్ల మెజార్టీతో, మొవ్వ మండలం పెడసనగల్లులో స్వతంత్ర అభ్యర్థి అయ్యంకి జయరాజు 1,373 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక గన్నవరం మండలం కేసరపల్లి-2, 3 స్థానాల్లో యరగాని రత్తయ్య, శొంఠి కిశోర్‌కుమార్ వరుసగా 559, 438 ఓట్ల మెజార్టీలతో గెలుపొందారు. చల్లపల్లి మండలం లక్ష్మీపురం-3లో మట్టా కనక విజయలక్ష్మి 275 ఓట్లతో, పమిడిముక్కలలో మెరకనపల్లి మంజు 1,115 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!