

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై క్రాస్ ఓటింగ్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. నాయకులపై ఉన్న వ్యతిరేకత, పార్టీ గుర్తులపై అవగాహన లేకపోవడం, స్థానిక నాయకుల బలాబలాలు తదితర కారణాలతో ఓటర్లు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వేర్వేరు పార్టీలకు మద్దతు పలికారు. దీంతో కొన్ని చోట్ల ఎంపీటీసీ స్థానాల్లో ఒక పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసిన ఓటర్లు, జడ్పీటీసీ స్థానానికి మరో పార్టీ అభ్యర్థిని గెలిపించారు. ఈ ప్రభావం ప్రధానంగా గన్నవరం, మొవ్వ, ఉంగుటూరు మండలాల్లో కనిపించింది. గన్నవరంలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి కుమారస్వామి కేవలం 63 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక్కడ మొత్తం 26 ఎంపీటీసీ స్థానాలకు గాను YSRCP ఏడు స్థానాల్లోనే గెలుపొందగా, కూటమి పార్టీలు 16 స్థానాలను కైవసం చేసుకున్నాయి. అయినప్పటికీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఓడిపోయారు. పురుషోత్తమపట్నం, ముస్తాబాద, సూరంపల్లి, తెంపల్లి ప్రాంతాల్లోనూ ఎంపీటీసీ స్థానాలకు కూటమికి, జడ్పీటీసీ స్థానానికి YSRCPకి ఓట్లు వేసినట్లు సమాచారం.
ఉంగుటూరులో జడ్పీటీసీ స్థానాన్ని కూటమి గెలుచుకున్నప్పటికీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ మొత్తం 16 స్థానాలకు గాను కూటమి ఎనిమిది, YSRCP ఏడు, సీపీఐ(ఎం) ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. సీపీఐ(ఎం) అభ్యర్థి కూడా YSRCPకి మద్దతు ప్రకటించడంతో ఎంపీపీ పదవి ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఇరు పక్షాల బలం సమానంగా ఉంటే లాటరీ ద్వారా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక మొవ్వలో క్రాస్ ఓటింగ్ ప్రభావం మరింత స్పష్టంగా కనిపించింది. ఇక్కడ జడ్పీటీసీ స్థానానికి జనసేన, YSRCPతో పాటు TDP రెబల్ అభ్యర్థి నన్నపనేని వీరేంద్ర పోటీ చేశారు. త్రిముఖ పోటీలో గెలిచే అవకాశం లేదని భావించిన YSRCP, కూటమి అభ్యర్థిని ఓడించేందుకు వీరేంద్రకు వ్యూహాత్మకంగా సహకరించినట్లు కథనం పేర్కొంది. YSRCPకి బలమైన ఓటు బ్యాంకు ఉన్న భట్లపెనుమర్రు, మొవ్వ, కాజలమందిపాలెం, చినముత్తేవి, వేములవాడ ప్రాంతాల్లో వీరేంద్రకు సుమారు 4,000 నుంచి 5,000 ఓట్లు వచ్చినట్లు అంచనా. ఆయనకు వచ్చిన మొత్తం 6,668 ఓట్లలో అధిక భాగం YSRCP ఓటు బ్యాంకు నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు. మొవ్వలో మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలకు గాను కూటమి అభ్యర్థులు 13 చోట్ల గెలిచినా, జడ్పీటీసీ ఎన్నికల్లో మాత్రం కూటమి అభ్యర్థి భారీ తేడాతో ఓటమి పాలయ్యారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!