

విదేశాల్లో ఉద్యోగం సంపాదించి ఆర్థికంగా స్థిరపడాలనేది ఎంతోమంది యువత, సామాన్యుల కల. అయితే ఈ ఆశను ఆసరాగా చేసుకుని నకిలీ రిక్రూటింగ్ ఏజెంట్లు ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. ఇలాంటి మోసాలను అరికట్టి, విదేశీ ఉద్యోగాల కోసం వెళ్లేవారికి సురక్షితమైన, పారదర్శకమైన సేవలు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసిన ఈ-మైగ్రేట్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రభుత్వం గుర్తించిన 2,300కు పైగా యాక్టివ్ రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెంట్ల వివరాలను తెలుసుకోవచ్చు. ఏజెంట్లు ఇచ్చే లైసెన్స్ నంబర్‌ను నమోదు చేసి దాని చెల్లుబాటును ధ్రువీకరించుకోవచ్చు. అలాగే మోసపూరిత ఏజెంట్లపై వచ్చిన ఫిర్యాదులు, ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన ఏజెన్సీల వివరాలను కూడా పరిశీలించవచ్చు.
ఈ పోర్టల్‌లో రిజిస్టర్డ్ విదేశీ యజమానులు, కంపెనీల వివరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో ఉద్యోగార్థులు తమకు వచ్చిన ఆఫర్ లెటర్ నిజమైనదా, సంబంధిత కంపెనీ అధికారికంగా నమోదై ఉందా అనే విషయాలను సరిచూసుకోవచ్చు. విదేశాంగ శాఖ ఈ-మైగ్రేట్ పోర్టల్‌కు పలు డిజిటల్ సేవలను జోడించింది. డిజీలాకర్ అనుసంధానం ద్వారా పాస్‌పోర్ట్, ఉపాధి ఒప్పంద పత్రాలు వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో సురక్షితంగా సమర్పించవచ్చు. భాషిణి యాప్ సహాయంతో ఇంగ్లీష్ పరిజ్ఞానం తక్కువగా ఉన్నవారు కూడా తెలుగుతో సహా ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని చదువుకోవచ్చు. అదనపు లావాదేవీ రుసుములు లేకుండా డిజిటల్ చెల్లింపులు చేసే సదుపాయం కూడా ఉంది. అర్హులైన వలస కార్మికులు ప్రవాసి భారతీయ బీమా యోజన పాలసీని నేరుగా ఈ పోర్టల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
విదేశాలకు వెళ్లిన తర్వాత ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి కూడా ఈ-మైగ్రేట్ పోర్టల్ ద్వారా ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించారు. యజమానులు వేధించినా, ఒప్పందం ప్రకారం జీతాలు చెల్లించకపోయినా బాధితులు లేదా వారి కుటుంబ సభ్యులు విదేశాంగ శాఖకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం 24 గంటల బహుభాషా హెల్ప్‌లైన్‌తో పాటు +91 74283 21144 వాట్సాప్ సేవలు అందుబాటులో ఉన్నట్లు సమాచారం. రిజిస్టర్డ్ ఏజెంట్ల లైసెన్స్ నంబర్లు, వాటి చెల్లుబాటు వివరాలు తెలుసుకోవడంతో పాటు విదేశీ ఉద్యోగాల కోసం స్థానికంగా నిర్వహించే ఇంటర్వ్యూల షెడ్యూళ్లను కూడా పరిశీలించవచ్చు. గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులకు సేవలు చేరువ చేసేందుకు ఈ పోర్టల్‌ను కామన్ సర్వీస్ సెంటర్లతో అనుసంధానించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!