

వినాయక విగ్రహాల నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా శబ్ద నియంత్రణ, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడటం, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకున్న చర్యలపై ఈ నెల 24లోగా ప్రాథమిక నివేదిక సమర్పించాలని తెలంగాణ హైకోర్టు హోంశాఖను ఆదేశించింది. గతేడాది ఆగస్టు 26న గణేశ్ ఉత్సవాల సందర్భంగా జారీ చేసిన మార్గదర్శకాలను ప్రతి ఏడాది అమలు చేయాలని స్పష్టం చేసింది. వాటి అమలుకు తీసుకున్న చర్యలను నివేదికలో పొందుపర్చాలని ఆదేశించింది.
గత ఆదేశాలకు విరుద్ధంగా నిర్మల్‌లో అధిక శబ్దంతో డీజేలు నిర్వహించడం, రాకపోకలకు అంతరాయం కలిగించడంపై దామోదర్‌రెడ్డి తదితరులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను జస్టిస్ శ్రవణ్‌కుమార్ విచారించారు. నిర్మల్‌లో ఈ నెల 13, 16 తేదీల్లో మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీలతో సమావేశాలు నిర్వహించి మార్గదర్శకాల అమలుకు చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ న్యాయవాది మహేశ్ రాజె తెలిపారు. 57 మంది డీజే నిర్వాహకులపై బైండింగ్ ప్రొసీడింగ్స్ జారీ చేశామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 8 కేసులు నమోదు చేశామని వివరించారు. రాత్రివేళ అధిక శబ్దంతో సౌండ్ సిస్టమ్‌లు వినియోగించడం వల్ల ప్రజలకు, ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇబ్బందులు కలుగుతాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ నెల 25న నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్, పరిసర ప్రాంతాల్లో గత ఆదేశాల అమలుపై తీసుకున్న చర్యల నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను 24కు వాయిదా వేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!