

తిరుమల శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించిన విదేశీ నాణేలను ప్రవాసాంధ్రుల కోసం ఏపీఎన్ఆర్టీ సొసైటీ అందుబాటులోకి తీసుకొచ్చింది. తితిదే నుంచి కొన్ని విదేశీ నాణేలను కొనుగోలు చేసిన సొసైటీ వాటిని ప్రత్యేకమైన పెట్టెల్లో సిద్ధంగా ఉంచింది. ప్రస్తుతం అమెరికా కరెన్సీ నాణేలు అందుబాటులో ఉండగా, ఒక్కో పెట్టెలో 20 డాలర్ల విలువైన నాణేలు ఉన్నాయి. వీటిని రూ. లేదా డాలర్లలో సమానమైన ధరకు కాకుండా ఒక్కో పెట్టెను 25 అమెరికన్ డాలర్లకు అందిస్తున్నట్లు సొసైటీ తెలిపింది.
విదేశాల్లో స్థిరపడిన భక్తులు తిరుమలకు వచ్చినప్పుడు అక్కడి కరెన్సీ నోట్లు, నాణేలతో హుండీలో ముడుపులు సమర్పిస్తుంటారు. నోట్లను బ్యాంకులు తీసుకుంటున్నప్పటికీ, ఆర్బీఐ నిబంధనల కారణంగా విదేశీ నాణేలను బ్యాంకులు స్వీకరించడం లేదు. దీంతో తితిదే వాటిని బల్క్‌గా విక్రయిస్తోంది. ఈ నాణేలను ప్రవాసాంధ్రులకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఏపీఎన్ఆర్టీ సొసైటీ గతంలో ‘సెవెన్ హిల్స్ టు సెవెన్ కాంటినెంట్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2019లో కార్యక్రమం నిలిచిపోగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని పునఃప్రారంభించింది. నాణేలు కావాలనుకునే ప్రవాసాంధ్రులు తాడేపల్లిలోని ఏపీఎన్ఆర్టీ సొసైటీ కార్యాలయాన్ని సంప్రదించాలని సొసైటీ అధ్యక్షుడు రవి కుమార్ వేమూరు తెలిపారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!