

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి, వారి సేవలు మరియు త్యాగాలను గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం జీఓ ఆర్టీ నం.679 జారీ చేసింది. ఉద్యమ సమయంలో కొందరు ప్రాణత్యాగం చేయగా, మరికొందరు శారీరక వైకల్యానికి గురయ్యారు. పలువురిపై కేసులు నమోదై జైలు జీవితం గడిపిన నేపథ్యంలో, వారి సేవలను అధికారికంగా గుర్తించాలనే డిమాండ్‌పై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ కమిటీకి ప్రభుత్వ సలహాదారు డా. కె. కేశవరావు చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ–విప్ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి నియమితులయ్యారు. సాధారణ పరిపాలన శాఖ పొలిటికల్ సెక్రటరీ కన్వీనర్‌గా ఉంటారు. ఉద్యమకారుల గుర్తింపుకు ప్రమాణాలను రూపొందించడం, జాబితా సిద్ధం చేయడం, వారికి కల్పించాల్సిన గౌరవం, సౌకర్యాలపై సిఫారసులు చేయడం కమిటీ ప్రధాన బాధ్యతగా ఉంటుంది. కమిటీ త్వరగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!