

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనంలో భారీగా తేడాలు చోటుచేసుకున్నట్లు సిట్ విచారణలో వెల్లడైంది. తొలుత నిర్వహించిన డిజిటల్ మూల్యాంకనం, అనంతరం హాయ్‌ల్యాండ్‌లో చేపట్టిన మూల్యాంకనం, చివరగా విజయవాడలో నిర్వహించిన మాన్యువల్ మూల్యాంకనాల్లో అభ్యర్థులకు వేర్వేరు మార్కులు కేటాయించినట్లు సిట్ గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా 59,205 మంది ప్రిలిమినరీ పరీక్షకు హాజరుకాగా, 9,679 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. వీరిలో 6,807 మంది అన్ని మెయిన్స్ పేపర్లు రాశారు. డిజిటల్ మూల్యాంకనం అనంతరం 326 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేయగా, తర్వాత నిర్వహించిన మాన్యువల్ మూల్యాంకనం ద్వారా 325 మందిని ఎంపిక చేశారు. ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం సాధారణంగా పునర్ మూల్యాంకనం నిషేధం కాగా, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అనుమతించాలి. అయితే ఈ గ్రూప్-1 నియామక ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా పునర్ మూల్యాంకనం జరిగినట్లు సిట్ పేర్కొంది. ఇంటర్వ్యూకు ఎంపికైన 325 మంది మార్కులను పరిశీలించగా.. మూడు మూల్యాంకనాల్లోనూ గణనీయమైన తేడాలు ఉన్నట్లు గుర్తించింది. ఒక్క అభ్యర్థికీ మూడు మూల్యాంకనాల్లో ఒకే రకమైన మార్కులు రాలేదని సిట్ వెల్లడించింది. వీరిలో 165 మంది చివరకు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కొందరికి డిజిటల్ మూల్యాంకనంలో ఎక్కువ మార్కులు రాగా, మరికొందరికి తుది మాన్యువల్ మూల్యాంకనంలో అధిక మార్కులు వచ్చినట్లు విచారణలో తేలింది.
ఇక ఇంటర్వ్యూ మార్కులు పలువురు అభ్యర్థుల ర్యాంకులను గణనీయంగా మార్చినట్లు సిట్ విచారణలో తేలింది. రాతపరీక్షలో తక్కువ మార్కులు సాధించిన కొందరు అభ్యర్థులకు ఇంటర్వ్యూలో అధిక మార్కులు రావడంతో మెరుగైన ర్యాంకులు, పోస్టులు దక్కినట్లు గుర్తించింది. అదే సమయంలో రాతపరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన పలువురికి ఇంటర్వ్యూలో అసాధారణంగా తక్కువ మార్కులు వచ్చినట్లు సిట్ పేర్కొంది. రోజువారీ ఇంటర్వ్యూలకు అభ్యర్థులను అక్షరక్రమంలో పిలిచినట్లు డిప్యూటీ కార్యదర్శి చెప్పినప్పటికీ, వాస్తవంగా ఆ విధానం అమలు కాలేదని విచారణలో బయటపడింది. అంతేకాకుండా, ప్రతి ఇంటర్వ్యూ బోర్డులో పాల్గొన్న సభ్యుల పేర్లు, వారి హోదాలకు సంబంధించిన వివరాలు గ్రూప్-1 నియామక విభాగం రికార్డుల్లో లేవని ఏపీపీఎస్సీ బృందం సిట్‌కు తెలిపినట్లు సమాచారం. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను 750 మార్కులకు నిర్వహించగా, ఇంటర్వ్యూకు 75 మార్కులు కేటాయించారు. దీంతో ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు తుది ర్యాంకులు, పోస్టుల కేటాయింపుపై గణనీయమైన ప్రభావం చూపినట్లు సిట్ విచారణలో వెల్లడైంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!