

ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిదో కలెక్టర్ల సదస్సు నేడు, రేపు రెండు రోజుల పాటు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనుంది. ఈ సదస్సుకు మంత్రులు కూడా హాజరుకానున్నారు. గత సదస్సుల్లో తీసుకున్న నిర్ణయాల అమలు తీరుపై సమీక్ష నిర్వహించడంతో పాటు, వాటిపై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికలను అధికారులు సమర్పించనున్నారు. తొలిరోజు జీఎస్‌డీపీ, స్వర్ణాంధ్ర విజన్, సూపర్ సిక్స్ పథకాల అమలు వంటి కీలక అంశాలపై చర్చ జరగనుంది. అలాగే తాగునీటి సరఫరా, గృహ నిర్మాణం, విద్య, వైద్య రంగాల్లో పురోగతిపైనా సమీక్ష నిర్వహించనున్నారు.
రెండో రోజు పరిపాలనా సంస్కరణలు, సాంకేతిక ఆధారిత పాలనకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈ-గవర్నెన్స్, పెండింగ్ ఫైళ్లను వేగంగా పరిష్కరించడం, ఆర్‌టీజీఎస్ పనితీరు తదితర అంశాలపై అధికారులు, కలెక్టర్లతో సీఎం సమీక్షించనున్నారు. జిల్లాల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధానాలపై కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంపై కలెక్టర్లకు ఈ సదస్సు ద్వారా కీలక సూచనలు ఇవ్వనున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!