

గోదావరి జిల్లాల భోజన ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఏడాది తొలి పులస చేప ఎట్టకేలకు గోదావరిలో ప్రత్యక్షమైంది. సముద్రం నుంచి గోదావరి నదిలోకి ఎదురీదుతూ వచ్చే ఈ అరుదైన చేప డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లి రేవు సమీపంలోని గౌతమి గోదావరిలో ఓ మత్స్యకారుడి వలకు చిక్కింది. సుమారు 1.250 కిలోల బరువున్న ఈ పులస చేపతో ఈ సీజన్‌కు అధికారికంగా శ్రీకారం చుట్టినట్లైంది. దీంతో మత్స్యకారులు, పులస ప్రియుల్లో ఆనందం నెలకొంది.
కోటిపల్లి వద్ద లభించిన ఈ పులస చేపను విక్రయం కోసం యానాం రేవుకు తీసుకెళ్లగా, బుధవారం నిర్వహించిన వేలం పాటలో కొనుగోలుదారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరకు పొన్నమండ రత్నం, భద్రం దంపతులు ఈ అరుదైన చేపను రూ.14 వేలకు సొంతం చేసుకున్నారు. పులసకు ఉన్న ప్రత్యేక రుచి, అరుదైన లభ్యత కారణంగానే ప్రతి ఏడాది దీనికి భారీ ధర పలకడం సహజమని స్థానికులు చెబుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!