

త్వరలోనే ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఎన్నికల అనంతరం కొత్తగా ఎన్నికైన కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు. శాసనసభలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని పదేళ్లపాటు విశ్రాంత ఈడీతో నడిపించారని, కార్మిక సంఘాలను రద్దు చేశారని విమర్శించారు. మహాలక్ష్మి పథకం కారణంగా బస్సులకు డిమాండ్ పెరిగిందని, పీఎం ఈ-డ్రైవ్ కింద హైదరాబాద్‌కు 2,200 బస్సులు, మరో 100 మినీ బస్సులు రానున్నాయని చెప్పారు. పాతబస్తీకి 50, ఎంఎంటీఎస్, మెట్రో అనుసంధానానికి మరో 50 బస్సులను వినియోగిస్తామని, ఓఆర్‌ఆర్ సమీపంలో బస్సు టెర్మినళ్లను నిర్మిస్తామని తెలిపారు. బస్సుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
రాష్ట్రంలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని శక్తి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. కార్మికుల సంక్షేమంపై అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్టీపీసీ, సింగరేణిలో కనీస వేతనాలు అమలు కావడం లేదన్న సభ్యుడు మక్కన్ రాజ్‌ఠాకూర్ ఆరోపణలపై విచారణ జరిపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పంచాయతీల్లో కనీస వేతనాన్ని రూ.9,500కు పెంచినా, అంతకంటే ఎక్కువ చెల్లించే సామర్థ్యం ఉన్నచోట కూడా వేతనాలు పెంచకూడదని చెబుతున్నారని కూనంనేని సాంబశివరావు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, దాని ద్వారా నేరుగా వేతనాలు చెల్లించాలని ఆయన కోరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!