

నేపాల్‌లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. భారీ ట్రక్కులు, వందలాది ఇళ్లు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయినా.. నువాకోట్ జిల్లాలోని ధుంగేలో ఓ ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా నిలిచింది. ఛత్ర బహదూర్‌కు చెందిన ఈ ఇంటి నిర్మాణంలో ఆయన సోదరుడు తేజ్ బహదూర్ ఇంజినీర్‌గా వ్యవహరించారు. 1996లో గ్రౌండ్ ఫ్లోర్‌ను నిర్మించగా.. ఐదేళ్ల తర్వాత మరో మూడు అంతస్తులను నిర్మించారు. దాదాపు 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఇల్లు తాజా వరదల్లో ఆరుగురి ప్రాణాలను కాపాడింది.
ఇంటి నిర్మాణంలో మందపాటి పిల్లర్లు, నాణ్యమైన స్టీల్ రాడ్లు, సిమెంటును వినియోగించడమే దాని పటిష్ఠతకు కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు. త్రిశూలి నది ఉప్పొంగడాన్ని గమనించిన ఛత్ర బహదూర్ కుటుంబం సమీపంలోని కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే వారు ఇంటి మెట్లు దిగేలోపే వరద ఉద్ధృతి పెరగడంతో బయటకు వెళ్లలేకపోయారు. దీంతో పై అంతస్తుకు చేరుకుని కొన్ని గంటలపాటు భయాందోళనల మధ్య గడిపారు. చివరకు వరద తగ్గిన తర్వాత ఇంట్లోని ఆరుగురూ సురక్షితంగా బయటపడ్డారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!