

తెలంగాణలో ప్రాంతీయ వలయ రహదారి (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) పనులను ఐదు ప్యాకేజీల నుంచి రెండు ప్యాకేజీలకు కుదిస్తూ తాజా టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా తంగడ్‌పల్లి వరకు 161.518 కిలోమీటర్ల మేర ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ రీజినల్ ఎక్స్‌ప్రెస్‌వేను రూ.9,362.4 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. ప్యాకేజీ-1లో గిర్మాపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు 83.518 కి.మీ. పనులు రూ.4,918.71 కోట్లతో చేపడుతుండగా, ప్యాకేజీ-2లో ప్రజ్ఞాపూర్ నుంచి తంగడ్‌పల్లి వరకు 78 కి.మీ. పనులు రూ.4,443.69 కోట్లతో చేపట్టనున్నారు. జులై 7 వరకు ఆన్లైన్ బిడ్లను స్వీకరించి, జులై 8న సాంకేతిక బిడ్లను తెరవనున్నారు.
డీబీవోటీ లేదా హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు ఎన్హెచ్ఏఐ తెలిపింది. గత రెండేళ్లుగా టెండర్ ప్రక్రియలో జాప్యం చోటుచేసుకున్నప్పటికీ, ఇప్పుడు సవరించిన ప్రణాళికతో పనులు ముందుకు కదులుతున్నాయి. భూసేకరణలో 70 శాతానికి పైగా అవార్డులు ప్రకటించగా, మిగతా ప్రక్రియ వివిధ దశల్లో కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టులో 44 భారీ వంతెనలు, 127 చిన్న వంతెనలు, 4 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, 44 అండర్‌పాసులు, 1,262 కల్వర్టులు, 9 టోల్ ప్లాజాలు నిర్మించనున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించే ఈ ఎక్స్‌ప్రెస్‌వే 9 ప్రాంతాల్లో జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానమవుతుంది. ఎలాంటి అడ్డంకులు లేకపోతే 2029 నాటికి ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!