

దేశంలోని అనేక దుకాణాలు, వస్త్ర విక్రయ కేంద్రాలు, ప్రదర్శనశాలలు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు గంటల తరబడి నిలబడి పనిచేయాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. కొన్ని చోట్ల పని లేకపోయినా కూర్చోకుండా ఉండాలనే నిబంధనలు అమలవుతున్నాయి. ఉద్యోగులను నిరంతరం నిలబెట్టడం వారి ఆరోగ్యం, గౌరవం, మానవ హక్కులపై ప్రభావం చూపుతుందని కార్మిక హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 గౌరవప్రదమైన, ఆరోగ్యకరమైన జీవన హక్కును కల్పిస్తుందని నిపుణులు గుర్తుచేస్తున్నారు.
వైద్య నిపుణుల ప్రకారం ఎక్కువసేపు నిలబడటం వల్ల కాళ్లు, మోకాళ్లు, నడుం, వెన్నెముక సమస్యలు, రక్త ప్రసరణ లోపాలు, అలసట, రక్తపోటు మార్పులు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. మహిళలు మరింత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఉద్యోగులకు కూర్చునే హక్కు కోసం కేరళలో కార్మికులు ఎనిమిదేళ్ల పాటు పోరాడగా, 2018లో రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణలు చేసి ఉద్యోగులకు కూర్చునే సౌకర్యం తప్పనిసరి చేసింది. అనంతరం తమిళనాడు కూడా ఇదే విధానాన్ని అమలు చేసింది. ఉద్యోగి గౌరవం, ఆరోగ్య రక్షణ కోసం ఈ హక్కును దేశవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!