

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ద్వైపాక్షిక, బహుపాక్షిక సమావేశాల కోసం ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్‌లలో పర్యటించనున్నారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సులో పాల్గొననున్న మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీలో భారత్-రష్యా ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష జరగనుంది. ఎస్సీవో సదస్సు చివరి రోజు ప్లీనరీలో మోదీ ప్రసంగించనుండగా, ఇతర సభ్య దేశాల నేతలతో కలిసి ఆరో వరల్డ్ నోమాడ్ గేమ్స్ ప్రారంభ వేడుకలకు కూడా హాజరుకానున్నారు.
కిర్గిస్థాన్ పర్యటనకు ముందు ఆగస్టు 29, 30 తేదీల్లో మోదీ ఉజ్బెకిస్థాన్‌లో పర్యటించనున్నారు. అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్‌తో తాష్కెంట్లో ప్రతినిధి స్థాయి చర్చలు జరపనున్న మోదీ, భారత్-ఉజ్బెకిస్థాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలపై ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. పర్యటనలో భాగంగా తాష్కెంట్‌లోని శాస్త్రి మెమోరియల్‌తో పాటు తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్‌లోని మహాత్మాగాంధీ కేంద్రాన్ని కూడా ప్రధాని సందర్శించనున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!