

ప్రాణహిత–చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి 100 టీఎంసీల నీటిని ఎల్లంపల్లికి మళ్లించే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారు. 150 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే మహారాష్ట్రలో ముంపు ప్రభావం తక్కువగా ఉంటుందని, అవసరమైతే పరిహారం చెల్లించేందుకు సిద్ధమని చెప్పారు. వెంటనే మహారాష్ట్రతో చర్చలు జరపాలని, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహకారం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఉన్నతస్థాయి సమీక్షలో కన్సల్టెన్సీ సంస్థలు బ్యారేజీ ఎత్తు, నీటి వినియోగంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చాయి. ఇప్పటికే కాల్వలతో సహా భారీ నిర్మాణాలు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. 150 మీటర్ల ఎత్తు ఉత్తమమని నిపుణులు సూచించారు. ఉన్న మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సీఎం పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్‌తో పాటు మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీరు అందుతుందని సీఎం తెలిపారు. మహారాష్ట్రతో సమన్వయం వేగవంతం చేయాలని, మేడిగడ్డ బ్యారేజీ రీస్టోరేషన్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. లిప్ట్ లేదా సొరంగం అంశంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!