

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తులు, ఉత్సవ నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని శాఖలను సమన్వయం చేస్తూ విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనం శుక్రవారం పూర్తికాగా, జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల నుంచి గణేశ్ విగ్రహాలు నిర్దేశిత నిమజ్జన ప్రాంతాలకు తరలుతున్నాయి.
వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నిర్వాహకులు, భక్తులు అధికారులకు సహకరించి విగ్రహాల తరలింపు, నిమజ్జన ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి కోరారు. డీజీపీ, జిల్లా కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్, పోలీస్ కమిషనర్ తదితర అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఎంజే మార్కెట్, చార్మినార్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడినప్పటికీ, వెంటనే చర్యలు తీసుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు బాధ్యతగా వ్యవహరిస్తూ నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!