

పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. దీపావళి పండుగ ముగిసినప్పటికీ అర్ధరాత్రి వరకు టపాసులు కాలుస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. దీపావళి రోజే ఈ విషయంపై స్పందిస్తే తనను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేస్తారనే ఉద్దేశంతో మౌనంగా ఉన్నానని తెలిపారు. అయితే పండుగ ముగిసిన తర్వాత కూడా రాత్రి 11 గంటల సమయంలో భారీ శబ్దాలతో టపాసులు కాల్చడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు. ఇతరుల ఇబ్బందులను పట్టించుకోకుండా సొంత ఆనందానికే ప్రాధాన్యత ఇవ్వడం సరైనది కాదని పేర్కొన్నారు.
దీపావళిని దీపాల పండుగగా ఆనందంగా జరుపుకోవాలని, దానిని శబ్దాల పోటీగా మార్చకూడదని రేణు దేశాయ్ సూచించారు. రాత్రి 10 గంటల్లోపే టపాసులు కాల్చడం ముగించి, ఆ తర్వాత ఇతరులకు ప్రశాంతత కల్పించాలని కోరారు. సొంత సంతోషం కోసం ఇతరులను ఇబ్బందులకు గురిచేయవద్దని, తోటి మనుషుల పట్ల కనీస దయ, సానుభూతి చూపించాలని తన పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు, కాలుష్యం గురించి మాత్రమే చర్చించడం వల్ల ప్రయోజనం లేదని, ఏడాది పొడవునా వాహనాలు, పరిశ్రమల కారణంగా కాలుష్యం కొనసాగుతుందని గుర్తుచేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!