

2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ప్రధాని పదవిని చేపట్టకూడదని నిర్ణయించుకున్న సందర్భాన్ని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ గుర్తుచేసుకున్నారు. మంగళవారం విడుదలైన తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’లో కుటుంబ జీవితం, రాజకీయ ప్రయాణంతో పాటు ప్రధాని పదవిని తిరస్కరించడం వెనుక ఉన్న కారణాలను వివరించారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందే ఈ నిర్ణయం తీసుకున్నానని, ఈ విషయాన్ని తన పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలకు కూడా చెప్పానని వెల్లడించారు. నానమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ హత్యలను ప్రత్యక్షంగా చూసినందున.. తాను ప్రధాని కావడం వల్ల కుటుంబ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని పిల్లలు ఆందోళన చెందారని తెలిపారు. అయితే ఎన్నికల సమయంలో తన నిర్ణయాన్ని బయటపెట్టకుండా, పార్టీని ఐక్యంగా ఉంచడంపైనే దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.
ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనప్పుడు ప్రధాని పదవి చేపట్టాలని పార్టీ నాయకులు తనపై ఒత్తిడి తెచ్చారని సోనియా తెలిపారు. తొలుత వారి ఒత్తిడికి అంగీకరించినప్పటికీ, తన పిల్లలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని గుర్తుచేసుకున్నారు. తన విదేశీ మూలాలను ప్రస్తావిస్తూ రాజకీయ ప్రత్యర్థులు వివాదాలు సృష్టించే అవకాశాలపైనా ఆలోచించానన్నారు. చివరకు ఎన్నో గంటల అంతర్మథనం తర్వాత ప్రధాని పదవిని చేపట్టకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. మరుసటి రోజు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ తన నిర్ణయాన్ని స్పష్టం చేసి, ప్రధాని అభ్యర్థిగా మన్మోహన్ సింగ్ పేరును ప్రతిపాదించారు. ప్రభుత్వంలో ఆయనకున్న సుదీర్ఘ అనుభవం, పార్టీలో తటస్థ వైఖరి, నాయకత్వ లక్షణాలు ఆయనను సరైన ఎంపికగా నిలిపాయని సోనియా తన పుస్తకంలో వివరించారు. మన్మోహన్ సింగ్ నాయకత్వంలో దేశం సురక్షితంగా ఉంటుందని విశ్వసించినట్లు పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!