

80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి 75 నిమిషాల పాటు జాతినుద్దేశించి ప్రసంగించారు. మహిళలకు అసెంబ్లీలు, పార్లమెంట్‌లో 33 శాతం రిజర్వేషన్లను వీలైనంత త్వరగా అమలు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశ నిర్మాణంలో యువత చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. సాయుధ నక్సలిజాన్ని అణచివేసినప్పటికీ, తాను ‘మేధో నక్సలిజం’గా అభివర్ణించిన భావజాలం నుంచి ప్రమాదం ఇంకా ఉందని హెచ్చరించారు. మారుతున్న భద్రతా పరిస్థితులకు అనుగుణంగా పౌర రక్షణ వ్యవస్థను పునరుద్ధరించి, బలమైన సివిల్ డిఫెన్స్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 2047 నాటికి అణుఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని 100 గిగావాట్లకు పెంచే లక్ష్యాన్ని వెల్లడించారు.
భారత్‌ను అగ్రశ్రేణి దేశాల సరసన నిలిపేందుకు ‘సప్తధార’ పేరుతో ఏడు అంశాల అభివృద్ధి మార్గసూచీని ప్రధాని ప్రకటించారు. తయారీ, పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడం, వ్యవసాయం-ఆహార శుద్ధిని ఎగుమతుల కేంద్రంగా మార్చడం, ఏఐ, డీప్‌టెక్, క్వాంటమ్ కంప్యూటింగ్, రోబోటిక్స్ వంటి సాంకేతిక రంగాల్లో ముందంజ వేయడం ఇందులో ఉన్నాయి. అలాగే పీఎం గతిశక్తి ద్వారా మల్టీమోడల్ రవాణాను విస్తరించడం, రక్షణ రంగంలో స్వావలంబన సాధించి ఎగుమతులు పెంచడం, గ్రీన్, బ్లూ ఎకానమీలను అభివృద్ధి చేయడం, సాంస్కృతిక దౌత్యం, విద్య, నైపుణ్యాల ద్వారా భారత సాఫ్ట్ పవర్‌ను బలోపేతం చేయడం వంటి అంశాలను చేర్చారు. యువత కోసం ఏఐ శిక్షణ, పోటీ పరీక్షలకు ఆన్‌లైన్ కోచింగ్, 2036 ఒలింపిక్స్ కోసం ప్రతిభాన్వేషణ, సెమీకండక్టర్లు, అంతరిక్షం, అణు, తయారీ రంగాల్లో అవకాశాలను ప్రస్తావించారు. స్వదేశీ 105 ఎంఎం లైట్ ఫీల్డ్ గన్‌లతో 21 గన్ సెల్యూట్, వాయుసేన హెలికాప్టర్ల పుష్పవర్షం, వందేమాతరం గీతాలాపనతో వేడుకలు ఘనంగా జరిగాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!