

ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్టు పరిధిలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆస్పత్రులపై ట్రస్టు చర్యలు చేపట్టింది. 2024–25 నుంచి 2026–27 మధ్య కాలంలో 203 ఆస్పత్రులపై చర్యలు తీసుకుని, మొత్తం రూ.34.39 కోట్ల జరిమానాలు విధించింది. ఇందులో భాగంగా 25 సస్పెన్షన్లు విధించడంతో పాటు, 13 సందర్భాల్లో చెల్లింపులను నిలిపివేసింది. ఐదు ఆస్పత్రులను నెట్‌వర్క్ జాబితా నుంచి తొలగించగా, మరో ఆస్పత్రి గుర్తింపును రద్దు చేసింది. గత ఆరు నెలల్లో 114 కేసుల్లో చర్యలు తీసుకుంది. వైద్య సేవల్లో లోపాలు, అనుమానాస్పద బిల్లులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఉచిత వైద్య సేవలకు డబ్బులు వసూలు చేసినా, అర్హులకు నగదు రహిత వైద్యం నిరాకరించినా కఠిన చర్యలు తీసుకుంటామని ట్రస్టు హెచ్చరించింది.
రోగుల ఫిర్యాదులపై విచారణ చేపట్టి, వైద్య రికార్డులను పరిశీలిస్తున్న ట్రస్టు.. అనుమానాస్పద బిల్లులను గుర్తించేందుకు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను వినియోగించనుంది. ఏఐ ద్వారా గుర్తించిన బిల్లులను ఆధారాలతో నిర్ధారించిన తర్వాతే చర్యలు తీసుకోనుంది. రోజుకు సుమారు 6 వేల ముందస్తు వైద్య అనుమతి అభ్యర్థనలను, 5,600 చికిత్సలకు సంబంధించిన బిల్లులను పరిశీలిస్తోంది. ముందస్తు అనుమతులకు రెండు దశల్లో, బిల్లులకు నాలుగు దశల్లో తనిఖీలు నిర్వహించనుంది. పెండింగ్ బిల్లుల పరిష్కారాన్ని వేగవంతం చేయడంతో పాటు, ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ట్రస్టు పనిచేస్తోంది. ఈ వివరాలతో ట్రస్టు సీఈఓ పద్మావతి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు నివేదిక సమర్పించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!