

బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్‌కు చెందిన ప్రైవేటు నివాసం సంద్రింగమ్ ఎస్టేట్‌లో చోరీ యత్నం కలకలం రేపింది. ఎస్టేట్‌లో అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించినట్లు, ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు అక్రమంగా లోపలికి ప్రవేశించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ సమాచారంతో అప్రమత్తమైన బ్రిటిష్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విస్తృత తనిఖీలు చేపట్టారు. హెలికాప్టర్లు, జాగిలాలు, డ్రోన్ల సాయంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి, ఎస్టేట్‌లోకి అక్రమంగా ప్రవేశించారనే అనుమానంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన జరిగిన సమయంలో ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్‌తో పాటు వారి పిల్లలు ఎస్టేట్‌లో లేరని పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ దంపతుల ప్రైవేటు నివాసంగా ఉన్న అన్మర్ హాల్‌లో పది బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. ఇది లండన్‌కు సుమారు 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. దివంగత బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 తన మనవడు విలియం, కేట్ దంపతులకు వివాహ కానుకగా ఈ నివాసాన్ని అందించారు. రాజకుటుంబానికి చెందిన నివాసంలో చోరీ యత్నం జరగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!