

జీ మీడియా అధినేత సుభాష్ చంద్ర వ్యక్తిగత గ్యారెంటీకి సంబంధించిన రుణ వివాదంలో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎస్సెల్, జీ గ్రూప్ కంపెనీల రుణాలకు సంబంధించి కొనసాగుతున్న కేసులో నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలని సీబీఐని ఐదుగురు సభ్యుల ప్రత్యేక బెంచ్ ఆదేశించింది. సీబీఐ దర్యాప్తు కేసు విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంటూ తదుపరి విచారణను వాయిదా వేసింది. తన వ్యక్తిగత నికర విలువ రూ.31.79 కోట్లుగా పేర్కొన్న సుభాష్ చంద్ర.. రుణదాతలకు రూ.6.50 కోట్లు చెల్లించే పునరుద్ధరణ ప్రణాళికను ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు 80.81 శాతం మంది రుణదాతల మద్దతు ఉందని ఆయన వాదించారు.
అయితే ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, ఐడీబీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, కెనరా బ్యాంక్ తదితర రుణదాతలు ఈ ప్రణాళికను వ్యతిరేకించారు. ఎన్‌సీఎల్‌టీ సభ్యుడు నీలేష్ శర్మ తొలుత ప్రణాళికను ఆమోదించినప్పటికీ, మెజారిటీ అభిప్రాయం లేకపోవడంతో సెప్టెంబర్ 1న ఐదుగురు సభ్యుల ప్రత్యేక బెంచ్ ఆ ఉత్తర్వులను నిలిపివేసింది. ఇదే సమయంలో ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌కు సంబంధించిన కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో వివాదం మరింత కీలకంగా మారింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆస్తులను విక్రయించడం లేదా బదిలీ చేయడంపై ఎన్‌సీఎల్‌టీ ఆంక్షలు విధించింది. ఓటింగ్‌లో 61.78 శాతం వాటా కలిగిన ఐదు సంస్థల గుర్తింపుపైనా వివాదం కొనసాగుతోంది. ఈ పరిణామాలను సవాల్ చేస్తూ సుభాష్ చంద్ర నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!