

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి గుట్టకింద ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ బొమ్మల దుకాణంలో చెలరేగిన మంటలు వేగంగా పక్కనే ఉన్న దుకాణాలకు వ్యాపించడంతో సుమారు 25 షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. మంటల తీవ్రతకు రెండు గ్యాస్ సిలిండర్లు కూడా పేలినట్లు స్థానికులు తెలిపారు. సమీపంలోని గ్రామపంచాయతీ కార్యాలయానికీ మంటలు వ్యాపించడంతో అందులోని పలు దస్త్రాలు కాలిపోయినట్లు సమాచారం.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మూడు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. పోలీసులు, గ్రామస్థులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. భారీగా మంటలు ఎగసిపడటం, గ్యాస్ సిలిండర్లు పేలినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!