

తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను పెంచడంతో పాటు ఇరుపక్షాల మధ్య వాణిజ్యాన్ని విస్తరించే అవకాశాలపై రాష్ట్ర నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, క్యాబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి. టు లారెల్ జూనియర్‌తో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. తెలంగాణలో భారీ స్థాయిలో వరి ఉత్పత్తి, నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేసే సామర్థ్యం, ఆధునిక రైస్ మిల్లింగ్ వ్యవస్థ ఉందని ఉత్తమ్ వివరించారు. తెలంగాణ నుంచి పెద్ద మొత్తంలో బియ్యం కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తామని లారెల్ సానుకూలంగా స్పందించారు.
బియ్యం రకాలు, ధరలు, నాణ్యతా ప్రమాణాలు, కొనుగోలు విధానాలు, రవాణా, ధ్రువీకరణ ప్రక్రియలు, శానిటరీ, ఫైటోశానిటరీ నిబంధనలపై ఇరువురు చర్చించారు. తెలంగాణ నుంచి మాంస ఉత్పత్తులు, నాణ్యమైన విత్తనాలను దిగుమతి చేసుకోవడంపైనా ఫిలిప్పీన్స్ ఆసక్తి వ్యక్తం చేసింది. విత్తనోత్పత్తి, ఆహార శుద్ధి, వ్యవసాయ అనుబంధ రంగాల్లో తెలంగాణకు బలమైన సామర్థ్యం ఉందని ఉత్తమ్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లను విస్తరించడం ద్వారా రైతులు, రైస్ మిల్లర్లు, విత్తన సంస్థలు, ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ఈ నెలలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు హాజరుకావాలని లారెల్‌ను ఆహ్వానించినట్లు తెలిపారు. ప్రతిపాదనలను కార్యరూపంలోకి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం, ఫిలిప్పీన్స్ రాయబార కార్యాలయం, సంబంధిత సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం సమన్వయం చేసుకుంటుందని ఉత్తమ్ వెల్లడించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!