

రెబల్ స్టార్ ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయన నటించిన దాదాపు రెండు దశాబ్దాల నాటి ‘పౌర్ణమి’ సినిమాలోని ‘భరత వేదముగ’ పాట ఇప్పుడు అనూహ్యంగా గ్లోబల్ స్థాయిలో వైరల్ అవుతోంది. చైనాకు చెందిన నాట్యకారిణి మీరా వాంగ్ ఈ పాటకు చేసిన క్లాసికల్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఆమె హావభావాలు, నాట్య భంగిమలకు తెలుగు ప్రేక్షకులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
2006లో విడుదలైన ‘పౌర్ణమి’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోయినా, సినిమాలోని పాటలు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. ముఖ్యంగా ‘భరత వేదముగ’ పాటకు ఛార్మీ కౌర్ చేసిన కూచిపూడి నృత్యం అప్పట్లో విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా, కేఎస్ చిత్ర ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చంద్రకౌన్స్ రాగంలో ఈ పాటను రూపొందించడం మరో ప్రత్యేకతగా నిలిచింది.
మీరా వాంగ్‌కు భారతదేశం అంటే ఆసక్తి ఉన్నప్పటికీ ఆమె ఇప్పటివరకు భారత్‌కు రాలేదని తెలుస్తోంది. అయినప్పటికీ కూచిపూడిపై ఆమెకు ఉన్న అభిమానం, పట్టుదల అందరినీ ఆకట్టుకుంటోంది. అనంతపురానికి చెందిన ఆల వెంకటగోపాల్‌ను తన కూచిపూడి గురువుగా ఆమె పేర్కొంటున్నారు. తెలుగు సినిమా పాటలకు క్లాసికల్ డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలను పంచుకుంటున్న ఆమె.. ‘మాయాబజార్’లోని ‘ఆహా నా పెళ్లంట’ వంటి క్లాసిక్ పాటలకూ నృత్యం చేశారు.
ప్రభాస్, త్రిష, ఛార్మీ కౌర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘పౌర్ణమి’కి ప్రభుదేవా దర్శకత్వం వహించారు. కథలో కూచిపూడి, సంప్రదాయ కళలు కీలక నేపథ్యంగా నిలిచాయి. ఒకప్పుడు థియేటర్లలో మోస్తరు ఫలితాన్ని అందుకున్న ఈ సినిమా నుంచి వచ్చిన ఓ పాట దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించడం విశేషంగా మారింది. మీరా వాంగ్ చేసిన నృత్య వీడియోకు భారతీయుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!