

జూబ్లీహిల్స్‌లోని జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ నివాసం వద్ద ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. తన అప్పులు తీర్చుకునేందుకు ఆర్థిక సహాయం చేయాలంటూ పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు వచ్చిన అతడిని భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దీంతో బౌన్సర్లతో వాగ్వాదానికి దిగిన ఆ వ్యక్తి.. తన వద్ద ఉన్న కత్తితో ఛాతి, చేతులపై కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్‌లో కలకలం రేపింది.
ఖమ్మం జిల్లా బల్లేపల్లికి చెందిన భట్టు సుచేతన్ ఠాకూర్ నాయక్ వ్యాపారి. బుధవారం సాయంత్రం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 35లోని పవన్ కల్యాణ్ నివాసానికి ఫ్లెక్సీ బ్యానర్‌తో చేరుకున్నాడు. వ్యాపారంలో అప్పులు కావడంతో వాటిని తీర్చేందుకు ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ అక్కడికి వచ్చినట్లు సమాచారం. అయితే బౌన్సర్ రామ్‌శెట్టి రాజీవ్ కుమార్ అతడిని లోపలికి అనుమతించకపోవడంతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అతడు దాడికి యత్నించడంతో పాటు కత్తితో తనను తాను గాయపరుచుకున్నాడు. అప్రమత్తమైన బౌన్సర్లు అతడిని అదుపులోకి తీసుకుని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. బౌన్సర్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!