

2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం సైన్స్ సిలబస్‌లో పలు కీలక మార్పులు చేపట్టారు. సవరించిన పాఠ్యపుస్తకాలు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు చేరుకున్నాయి. హైదరాబాద్ తెలుగు అకాడమీ భవన్లో ఆంగ్ల మాధ్యమ పుస్తకాల విక్రయాలు కూడా ప్రారంభమయ్యాయి. రసాయనశాస్త్రంలో “పదార్థాల స్థితులు”, “హైడ్రోజన్ మరియు వాటి సమ్మేళనాలు”, “పర్యావరణ రసాయనశాస్త్రం” అధ్యాయాలను తొలగించారు. భౌతికశాస్త్రంలో “ఫిజికల్ వరల్డ్” మరియు “యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్” అధ్యాయాలను కలిపి ఒకటిగా మార్చగా, కృత్రిమ మేధ మరియు ఆధునిక సాంకేతికతలపై అవగాహన కల్పించే “ఫిజిక్స్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీ” అనే కొత్త అధ్యాయాన్ని చేర్చారు. గణితం 1-ఏలో “సెట్స్ అండ్ రిలేషన్స్”, “సీక్వెన్సెస్ అండ్ సిరీస్” అనే రెండు కొత్త అధ్యాయాలు చేరాయి. గణితం 1-బిలో ఎటువంటి మార్పులు లేవు.
దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇంటర్ సైన్స్ సిలబస్‌లో మార్పులు చోటుచేసుకోవడం విశేషం. జేఈఈ మెయిన్, నీట్ వంటి పోటీ పరీక్షలకు అనుగుణంగా పాఠ్యాంశాలు లేవన్న విమర్శల నేపథ్యంలో ఈ సవరణలు చేపట్టారు. జంతుశాస్త్రం, వృక్షశాస్త్రంలో కూడా ఎకనామిక్ జువాలజీ, ఎకనామిక్ బోటనీ వంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడే అధ్యాయాలను చేర్చారు. ఇదే సమయంలో గణితం పరీక్ష విధానంలో కూడా మార్పులు చేశారు. ఇప్పటివరకు 75 మార్కులుగా ఉన్న గణితం రాత పరీక్షను 60 మార్కులకు తగ్గించి, 15 మార్కుల ప్రాక్టికల్స్‌ను ప్రవేశపెట్టారు. ప్రశ్నపత్రం భౌతిక, రసాయనశాస్త్రాల మాదిరిగా సెక్షన్-ఏ, బి, సి విధానంలో ఉండనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!