

హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కేంద్రం, రాష్ట్రం 50:50 నిష్పత్తిలో భరించే విధంగా ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సమావేశం అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. హైదరాబాద్‌కు సంబంధించిన పలు పట్టణాభివృద్ధి ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 162 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు సంబంధించిన డీపీఆర్, సాంకేతిక వివరాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్రం తెలిపింది. మూసీ నది పరిశుభ్రత కోసం అమృత్ 2.0 పథకం కింద రూ.3,975 కోట్లతో 39 శుద్ధి ప్లాంట్లను మంజూరు చేసినట్లు ఖట్టర్ వివరించారు. రోజుకు 972 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసే సామర్థ్యం వీటికి ఉందని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. అంతకుముందు కిషన్‌రెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!