

ఉద్యోగుల పింఛను పథకం (EPS) కింద అందించే కనీస నెలవారీ పింఛనును ప్రస్తుతమున్న రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచే ప్రతిపాదనను ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో కార్మికశాఖ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. నవంబర్ 19న జరగనున్న ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో ప్రత్యేక ఎజెండా అంశంగా దీనిని చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 81.48 లక్షల మంది ఈపీఎస్ పింఛనుదారులు ఉండగా, వారిలో దాదాపు 73.55 లక్షల మంది నెలకు రూ.3,000లోపు పింఛను పొందుతున్నారు. ప్రతిపాదిత పెంపు అమల్లోకి వస్తే వీరందరికీ ప్రయోజనం కలగనుంది.
2014లో ఈపీఎఫ్‌వో వేతన పరిమితిని రూ.6,500 నుంచి రూ.15,000కు పెంచిన సమయంలో కనీస పింఛనును రూ.1,000గా నిర్ణయించింది. అప్పట్లో దాదాపు 80 శాతం మంది పింఛనుదారులకు నెలకు రూ.1,000 కంటే తక్కువ మొత్తం అందేది. దీంతో కనీస పింఛను విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. అయితే, పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా కనీస పింఛనును పెంచాలని కార్మిక సంఘాలు గత కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల సెప్టెంబరులో గరిష్ఠ వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచిన నేపథ్యంలో కనీస పింఛనును కూడా రూ.3,000కు పెంచే అంశంపై చర్చలు ఊపందుకున్నాయి. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే తెలంగాణలో సుమారు 5 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం చేకూరనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!