

తెలంగాణ ఆత్మగౌరవాన్ని తన కలం, గళం ద్వారా ప్రపంచానికి చాటిన ప్రజాకవి స్వర్గీయ అందెశ్రీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. అక్షరాన్ని ఆయుధంగా, పాటను ఉద్యమ గళంగా మలిచి తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి, సంప్రదాయాలను ప్రజల హృదయాల్లో నిలిపిన మహనీయుడిగా అందెశ్రీని స్మరించుకున్నారు. కవిగా, రచయితగా, విమర్శకుడిగా, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా ఆయన అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో అందెశ్రీ రచనలు ప్రజల్లో చైతన్యాన్ని రగిలించి, రాష్ట్ర సాధన ఆకాంక్షకు బలమైన స్వరంగా నిలిచాయని గుర్తుచేశారు.
'జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం' గీతం ద్వారా తెలంగాణ తల్లి వైభవాన్ని, ఈ నేల సంస్కృతి, సంప్రదాయాలను, ప్రజల ఆకాంక్షలను అందెశ్రీ అద్భుతంగా ఆవిష్కరించారని సీఎం పేర్కొన్నారు. ఆయన కలం నుంచి వెలువడిన ప్రతి అక్షరం తెలంగాణ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన అందెశ్రీ సాహిత్యం, పాటలు, ఆశయాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని తెలిపారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతి ఉన్నంతకాలం అందెశ్రీ పేరు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొంటూ ఆ మహాకవికి ఘనంగా జోహార్లు అర్పించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!