

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రేపు నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న ‘పాంచజన్య సంకల్ప సభ’ ద్వారా తన రాజకీయ కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా సొంత జిల్లా నిజామాబాద్‌లో భారీ సభ నిర్వహించనున్న కవిత.. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ పునరేకీకరణకు శ్రీకారం చుట్టనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సభకు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలను సమీకరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
‘పాంచజన్యం’ను పార్టీ ప్రధాన ఎజెండాగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, వివిధ పార్టీల్లో ఉన్న తెలంగాణవాదులు, ఉద్యమకారులు, నిజామాబాద్‌తో అనుబంధం ఉన్న నాయకులను ఒకే వేదికపైకి తీసుకురావాలని కవిత లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. సామాజిక న్యాయం, సబ్బండ వర్గాల అభివృద్ధి, సాధికారతే తమ రాజకీయ దిశగా పేర్కొంటున్న ఆమె రాష్ట్రవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు క్షేత్రస్థాయి కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఇందూరు సభను ఈ రాజకీయ ప్రయాణానికి కీలక మైలురాయిగా భావిస్తున్నారు.
సభలో కవిత పలు కీలక విధానాలను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. నిరుపేదలు, పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు, తెలంగాణ ఉద్యమకారులకు సూపర్‌న్యూమరరీ పోస్టులు, యువతకు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వ హామీతో రుణాలు వంటి ప్రతిపాదనలను వివరించనున్నట్లు చెబుతున్నారు. రైతుల సంక్షేమం, సామాజిక న్యాయం, సాధికారతపై తమ భవిష్యత్ ప్రణాళికను కూడా ఈ సభ వేదికగా వెల్లడించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!